ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 1:41 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించి 40 శాతం వాటా చెల్లించాలికాంట్రాక్ట్ కార్మికులకూ సమానంగా లాభాల వాటా ఇవ్వాలి: టీఎన్టీసీ.

సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించి 40 శాతం వాటా చెల్లించాలికాంట్రాక్ట్ కార్మికులకూ సమానంగా లాభాల వాటా ఇవ్వాలి: టీఎన్టీసీ.

బెల్లంపల్లి: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 3.

సింగరేణి యాజమాన్యం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు 40 శాతం లాభాల వాటాను చెల్లించాలని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ (టీఎన్టీసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓపెన్‌కాస్ట్ జనరల్ మేనేజర్, ఎస్‌ఓఎం అధికారికి టీఎన్టీసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడిచినా లాభాల వివరాలను ప్రకటించకపోవడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొందని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి 60 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణయించగా, 58 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. సంస్థ అభివృద్ధికి కార్మికులే పునాదులుగా నిలుస్తున్నందున, వారికి లాభాల్లో తగిన వాటా కల్పించాలని కోరారు.

దీపావళికి ముందు చెల్లించే ప్రాఫిట్, లిక్విడ్ రివార్డ్ స్కీమ్, టీఎల్ఆర్ బోనస్ మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రూ.1.15 లక్షల నుంచి మరింత పెంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల చొప్పున చెల్లిస్తున్న లాభాల వాటాను కూడా శాశ్వత కార్మికులతో సమానంగా చెల్లించాలని కోరారు.

పలు సమస్యల పరిష్కారానికి డిమాండ్లు

సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, నాలుగు లేబర్ కోర్టుల రద్దు, సొంతింటి పథకం అమలు, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల అమలు, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడం వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని టీఎన్టీసీ నాయకులు కోరారు.

అలాగే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, సంబంధిత న్యాయస్థానాల తీర్పుల మేరకు కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఫస్ట్ కేటగిరీ వేతనాన్ని అమలు చేయడంతో పాటు, సీపీఎంఆర్ఎస్‌కు సంబంధించి అధికారులు, కార్మికుల మధ్య వ్యత్యాసం లేకుండా రూ.25 లక్షల చెల్లింపు చేయాలని కోరారు. రిటైర్డ్ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలని విజ్ఞప్తి చేశారు.

కార్మికులకు పనిముట్లు అందించాలి

సింగరేణిలోని అండర్‌గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు అవసరమైన పనిముట్లు సక్రమంగా అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు తెలిపారు. కార్మికుల సమస్యలను గుర్తించి వెంటనే అవసరమైన పనిముట్లను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యం తక్షణమే స్పందించకపోతే అన్ని జీజీఎం కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని టీఎన్టీసీ నాయకులు హెచ్చరించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బెల్ట్ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీఎన్టీసీ నాయకులు టీ. మనిరాంసింగ్, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఓ. జీవరత్నం, టీఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు బొల్లు మల్లయ్య, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గజ్జే దుర్గయ్య, బెల్లంపల్లి ఏరియా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎన్. పుల్లయ్య, డి. ఎంజయ్య, సీహెచ్. క్రిష్టయ్య, గోలేటి గ్రూప్ ఆఫ్ మైన్స్ అధ్యక్షుడు గుర్రం గంగయ్య, ఎండీ. అన్వర్ తదితరులు పాల్గొన్నారు.